CSK vs KKR: కెప్టెన్ మరీనా సీఎస్కే ఆటతీరు మరలా.. చెపాక్‌లో చెత్తగా ఓడిన చెన్నై.! 4 d ago

IPL 2025లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై చెత్త రికార్డును నమోదు చేసింది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో CSK... కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వరుసగా ఓడిపోతున్నా చెన్నై జట్టు ధోని కెప్టెన్సీ లో కూడా ఓటమి నుంచి బయటపడలేక పోయింది.
రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌లలో ఒక్క దాంట్లో మాత్రమే గెలిచిన చెన్నై.. కెప్టెన్ మారినా ఆటతీరు మాత్రం మార్చుకోలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 100 పరుగులు చాలా కష్టం మీద చేసింది. KKR జట్టు 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించింది. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. డబుల్ పెర్ఫార్మెన్స్ చేసిన సునీల్ నరైన్ "మాన్ ఆఫ్ ది మ్యాచ్" గా నిలిచాడు.
తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే చెన్నై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు పెద్దగా రాణించలేక పోయారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే డెవాన్ కాన్వే (12) వికెట్ కోల్పోగా.. ఆ తర్వాత ఓవర్‌లోనే రచిన్ రవీంద్ర (4) కూడా ఔటయ్యాడు. కీలకమైన వన్‌డౌన్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ త్రిపాఠి కూడా టెస్టు మ్యాచ్ ఆడినట్టుగా నెమ్మదిగా ఆడాడు. 22 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ (21 బంతుల్లో 29 పరుగులు) కూడా తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో చెన్నై జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా వరుసగా పెవిలియన్‌కు చేరడంతో CSK జట్టు కుప్పకూలిపోయింది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దీపక్ హుడా కూడా డకౌట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ (1), రవీంద్ర జడేజా (0), ఎంఎస్ ధోనీ (1) దారుణంగా విఫలమయ్యారు. ఇక 100 పరుగులు కూడా కష్టం అనుకున్న సమయంలో.. శివమ్ దూబే (31*) ఒక్కడే కాస్త నిలకడగా ఆడాడు. చివరి బంతికి డూబే ఫోర్ కొట్టడంతో చెన్నై వంద పరుగుల మార్కును స్కోరు చేసింది. దీంతో CSK నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 మాత్రమే చేసింది.
కోల్‌కతా జట్టులోని ప్రతి బౌలర్ కనీసం ఒక్క వికెట్ అయినా తీశారు. సునీల్ నరైన్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు సాధించారు. అలాగే మొయిన్ అలీ, వైభవ్ అరోరా ఒక్కో వికెట్ తీశారు.
ఛేజింగ్ కు దిగిన కోల్‌కతా ఓపెనర్లు కనికరం లేకుండా ఆడారు. మొదటి ఓవర్ నుంచే హిట్టింగ్ ప్రారంభించారు. క్వింటన్ డి కాక్, సునీల్ నరైన్ ఓపెనర్లు ఇద్దరు చెలరేగిపోయారు.. CSK బౌలర్లను చిత్తడి చేసారు.
పవర్ ప్లే లోనే సగం పరుగులు కొట్టేసారు. క్వింటన్ డికాక్ (23).. సునీల్ నరైన్ (44 అఫ్ 18 బాల్స్) దెబ్బకి మ్యాచ్ వన్-సైడ్ అయిపోయింది. ఆ తరువాత వచ్చిన అజింక్య రహానే (20*).. రింకూ సింగ్ (15*) రాణించడంతో.. 10.1 ఓవర్లలోనే 104 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించారు. ఈ పరాజయం చవిచూసిన కూడా చెన్నై సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో 9వ ప్లేసులో కొనసాగుతోంది.